సబితా, ధర్మాన ప్రసాద్ ఔట్
posted on May 27, 2013 @ 10:51AM
రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుల రాజీనామాల సస్పెన్స్ కు తెరపడింది. వారం రోజులుగా వారి రాజీనామాలను ఆమోదించకుండా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆదేశాలతో ఎట్టకేలకు వారి రాజీనామా లేఖలను గవర్నర్ కు ఈ ఉదయం పంపడం గవర్నర్ నరసింహన్ ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయింది. వాన్‌పిక్ కేసులో ఐదో నిందితుడుగా ధర్మాన ప్రసాదరావు ఉండగా, దాల్మియా సిమెంట్స్ కేసులో నాలుగో నిందితురాలుగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.అయితే తాము నిర్దోషులమని, తమకు మరింత గడువు కావాలని, కోర్టు ఒప్పుకోకుంటే రాజీనామాలు ఆమోదించాలని వారు వాదిస్తున్నారు. ఇక అసేంబ్లీ సమావేశాలు, అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి రాజీనామాలు ఆమోదించకుండా నెట్టుకురావాలని, అధిష్టానాన్ని కొన్ని రోజుల గడువు కోరాలని ముఖ్యమంత్రి యోచించారు. ఇదే విషయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ కు ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పారు. అయితే సోనియా ఆదేశాల ప్రకారం రాజీనామాలు ఆమోదించాల్సిందేనన్న నిర్ణయంతో ఎట్టకేలకు వాటిని ఆమోదించారు.